ఇక్ష్వాకు కులతిలక
యికనైన పలుకవె రామచంద్రా
నన్ను రక్షింపకున్నను
రక్షకులెవరయ్య రామచంద్రా
చుట్టు ప్రాకారములు
సొంపుగ కట్టిస్తి రామచంద్రా
ఆ ప్రాకారమునకు పట్టె
పదివేల వరహాలు రామచంద్రా
గోపుర మంటపాలు
కుదురుగ కట్టిస్తి రామచంద్రా
నను క్రొత్తగ చూడక
ఇత్తరి బ్రోవుము రామచంద్రా
భరతునకు చేయిస్తి
పచ్చల పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె
పదివేల వరహాలు రామచంద్రా
శత్రుఘ్నునకు చేయిస్తి
మొలతాడు రామచంద్రా
ఆ మొలతాడునకు పట్టె
మొహరీలు పదివేలు రామచంద్రా
లక్ష్మణునకు చేయిస్తి
ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె
పదివేల వరహాలు రామచంద్రా
సీతమ్మకు చేయిస్తి
చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె
పదివేల మొహరీలు రామచంద్రా
కలికి తురాయి నీకు
పొలుపుగ చేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు తిరిగేవు
ఎవరబ్బ సొమ్మని రామచంద్రా
మీ తండ్రి దశరథ
మహారాజు పెట్టెనా రామచంద్రా
లేక మీ మామ జనక మహరాజు
పంపెనా రామచంద్రా
అబ్బా తిట్టితినని
ఆయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బల కోర్వక
అబ్బా తిట్టితినయ్య రామచంద్రా
భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా
నీవు క్షేమముగ రామదాసుని
ఏలుము రామచంద్రా
ఇక్ష్వాకు కులతిలక
యికనైన పలుకవె రామచంద్రా
నన్ను రక్షింపకున్నను
రక్షకులెవరయ్య రామచంద్రా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి